నయా తెలంగాణ న్యూస్, జులై 01:
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులను వేగవంతం చేసేందుకు, లబ్ధిదారుల ఖర్చులను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నిర్మాణ సామాగ్రి అయిన సిమెంటు, స్టీల్, ఇటుక వంటి వాటి ధరలను మండల స్థాయిలో నిర్ణయించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గి, సామాన్యులకు అదనపు భారం తగ్గుందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 ప్రాంతాల్లో ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇసుక సామాన్యులకు మరింత అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
